ప్రపంచకప్‌లో మరో సంచలనం. వరల్డ్ నంబర్ 2 జట్టు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘ఆల్‌రౌండ్ షో’ తో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (74), షఫీకి (58) అర్ధశతకాలు సాధించారు. ఆఖర్లో షాదబ్ ఖాన్ (40), ఇఫ్తికర్ అహ్మద్ (40) దూకుడుగా ఆడటంతో ఛేదనకు కష్టమైన లక్ష్యాన్ని అఫ్గాన్‌కు నిర్దేశించింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్ ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మనుల్లా గుర్బాజ్ (65) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. బలమైన పాక్ పేస్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. జద్రాన్ నిలకడగా ఆడగా గుర్బాజ్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా ఈ జోడీ 15.3 ఓవర్లలోనే స్కోరును 100 దాటించింది. ఈ క్రమంలో ఇబ్రహీం 54 బంతుల్లో, గుర్బాజ్ 38 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశారు. అయితే గుర్బాజ్‌ను షాహీన్ అఫ్రీది ఔట్ చేయడంతో 130 పరగుల వద్ద అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్(77*)తో కలిసి ఇబ్రహీం అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న ఇబ్రహీంను హసన్ అలీ ఔట్ చేశాడు.
అప్పటికే అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఆధిపత్యం కొనసాగియిస్తోంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హస్మతుల్లా (48*)తో కలిసి రహ్మత్ పాక్‌కు అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఛేదన ఆద్యంతం పాక్ బౌలర్లు విశ్వప్రయత్నాలు చేసినా అఫ్గాన్ బ్యాటర్లు సాధికారికంగా ఆడుతూ విజయాన్ని సాధించారు. వికెట్ల మధ్య పరుగులు, సింగిల్స్‌ను డబుల్స్‌గా మారుస్తూ పాక్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. మొత్తంగా ఈ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని సాధించారు. అక్టోబర్ 15న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అఫ్గాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.