అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విధ్వంసం కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా వీటిలో అయిదు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి వాయవ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన ప్రకంపనం తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది.