మహేష్….. ఏదో సినిమాలో చెప్పినట్టు, ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అందుకే మహేష్ బాబు పేరు వినగానే ఫ్యాన్స్ ఫేస్ లో ఆటోమేటిక్ గా ఓ మెరుపు వస్తుంది. తండ్రితో బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ‘రాజకుమారుడు’ తో హీరోగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మహేష్. అక్కడి నుండి హిట్లు , బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ కొడుతూ హీరోగా దూసుకెళ్తున్నాడు. మహేష్ బర్త్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ..
‘మురారి’ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై వారి ప్రతి ఇంట్లో కుర్రాడిలా మారిపోయిన మహేష్ ని ఘట్టమనేని ఫ్యాన్స్ కి అలాగే మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసి సూపర్ స్టార్ ని చేసిన సినిమా ‘ఒక్కడు’. ఆ సినిమాతో మహేష్ కమర్షియల్ గా తన సత్తా ఏంటో చాటి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది.
ఒక్కడు మూవీ నుండి ప్రిన్స్ యాక్షన్ సినిమాలతో చెలరేగిపోయాడు. పండుగాడు అంటూ రెచ్చి పోయి ‘పోకిరి’తో రికార్డులు తిరగరాసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి సూపర్ స్టార్ డమ్ అందుకున్నాడు. అప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ ఊచకోత కోసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
పోకిరి సినిమా తర్వాత ప్రిన్స్ కాస్తా సూపర్ స్టార్ అయ్యాడు. మహేష్ కథల ఎంపిక గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మహేష్ హీరోగా ఎవరూ చేయలేని ఎన్నో ప్రయోగాలు చేశాడు. ‘యువరాజు’, ’నిజం’, ’అర్జున్’ , ‘టక్కరి దొంగ’, ’నాని’, ’బ్రహ్మోత్సవం’ ఈ సినిమాలతో ప్రయోగం చేసి నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగాడు.
‘అతడు’ సినిమాతో ఓవర్ సీస్ లో మార్కెట్ క్రియేట్ చేసుకొని అక్కడ వరుసగా తన సినిమాలతో మిలియన్లు కొల్లగొడుతూ డిస్ట్రిబ్యూటర్స్ తో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్తున్నాడు.
సినిమాలు చేయడంతో పాటు ఫ్యామిలీ కి మహేష్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో రిలీజ్ తర్వాత పక్కా ఫ్యామిలీ మేన్ గా మారిపోయి ఫారిన్ ట్రిప్స్ వేస్తుంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఈ హీరో విదేశాల్లోనే ఉన్నాడు. తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య స్కాంట్లాండ్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు.
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోగా మారి ఎందరో చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ లు చేయిస్తూ వారి గుండెల్లో శ్రీమంతుడుగా ముద్ర వేసుకున్నాడు. మహేష్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే బయటకు తెలుసు. పైకి చెప్పని ఛారిటీ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దటీజ్ మహేష్ బాబు.
మహేష్ అంటే కేవలం ఓ హీరో మాత్రమే కాదు, ఇదో బ్రాండ్. మహేష్ కనిపిస్తే కోట్లు కురుస్తాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలన్నీ మహేష్ వెంట పడతాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు చేతిలో ఉన్నన్ని వాణిజ్య ప్రకటనలు, మరే ఇతర హీరో చేతిలో లేవు. సగటున 2 నెలలకు ఓ యాడ్ చేస్తుంటాడు మహేష్.
సినిమాలతో సంపాదించేదానికంటే, యాడ్ రెవెన్యూ రూపంలోనే మహేష్ ఎక్కువగా ఆర్జిస్తున్నాడనేది ఓపెన్ సీక్రెట్. దీంతో పాటు ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్-3 హీరోల్లో మహేష్ ఒకడు. ఈ విషయాన్ని ఈమధ్య పవన్ కల్యాణ్ కూడా అంగీకరించాడు.
తనకంటే మహేష్ బాబు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనే ఏకంగా ఓ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చెప్పడం, మహేష్ స్టార్ డమ్ కు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక తన పారితోషికంపై మహేష్ కూడా ఓ సందర్భంలో స్పందించాడు. తను చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయా, ఫ్లాప్ అవుతున్నాయా అనే విషయంతో సంబంధం లేకుండా తన రెమ్యూనరేషన్ పెరుగుతోందని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరుకారం సినిమా చేస్తున్నాడు మహేష్. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా రిలీజైన గ్లింప్స్ తో అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా కొనసాగుతోంది గుంటూరుకారం.
గుంటూరుకారం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు మహేష్. ఈ మూవీ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. ఇలా వయసు పెరిగేకొద్దీ తన అందంతో పాటు, స్టార్ డమ్ ను కూడా పెంచుకుంటూ పోతున్నాడు మహేష్.