విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్‌తో పాటు గోదాము, సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు 300కు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం. దీంతో వందల సంఖ్యలో వాహనాలను ఆ గోదాములో ఉంచుతారు. అంతేగాక షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌ను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు.
షోరూమ్‌లోని మొదటి అంతస్తులో ఇవాళ తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. కొద్ది సమయంలోనే మంటలు గోదాముకు కూడా విస్తరించాయి. వెంటనే భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూమ్ నిర్మించడంతో మంటలు వేగంగా విస్తరించాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.