విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జెండా ఎగురువేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు.
జాతీయ జెండా 140 కోట్ల మంది భారతీయులు హృదయమని, ప్రజాస్వామ్యానికి గుర్తు అని సీఎం జగన్ అన్నారు. గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని, లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోందని వెల్లడించారు. ఈ మువ్వన్నెల జెండాకు రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని సీఎం జగన్ అన్నారు. 50 నెలల తమ ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని వివరించారు. గత ప్రభుత్వాలు అమలు చేయలేని గొప్ప మార్పు ఇది అని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. పాడి రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని చెప్పారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తయిందని, 2025లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేశామని అన్నారు.