విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం కోటగిరి వరలక్ష్మి (72)ని వార్డు వాలంటీర్ రాయవరపు వెంకటేశ్ (26) హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్ పురుషోత్తపురంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్ వెంకటేశ్ పార్ట్‌టైంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి వెంకటేశ్ వెళ్లాడు. తిరిగి మళ్లీ దుకాణం వద్దకు వెళ్లాడు.
అయితే అర్ధరాత్రి 12.30 గంటలకు శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూసేసరికి ఆయన తల్లి వరలక్ష్మి అచేతనంగా మంచంపై పడి ఉండటాన్ని గమనించాడు. అంతేగాక ఆమె మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడాన్ని గుర్తించాడు. దీంతో డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పెందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్న వార్డు వాలంటీర్ వెంకటేశ్ వచ్చి వెళ్లినట్లు అందులో రికార్డయింది.
దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి వాలంటీర్ ఆమెను తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.