భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై చిరుత దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నడక మార్గంలో తిరుమలకు వెళ్లే చిన్నారులకు ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్ ఫ్రీ నంబర్ పొందుపరుస్తున్నారు. అంతేగాక తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను బృందాలుగా అనుమతిస్తున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.