TTD: కర్రతో పులి ఆగుతుందా?

తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చగలరు? ఇలాంటి దుస్థితి మరెవరకీ కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా సమీక్షను నిర్వహించాయి. అయితే భక్తుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు సమీక్షలో ఏం నిర్ణయించారు?

  • భక్తులను గుంపులుగా అనుమతి. వారి ముందూ వెనుకా భద్రత సిబ్బంది.
  • నడకదారుల్లో కనిపించే జంతువులకు భక్తులు ఆహారాన్ని అందించడం పూర్తిగా నిషేధం, విక్రయించే వారిపైనా చర్యలు.
  • వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు 500 ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు.
  • అలిపిరి మార్గంలోని కీలక ప్రాంతాల్లో ఇరువైపులా 30 అడుగుల మేర ఫోకస్‌ లైట్లు.
  • లఘుచిత్రాలు ప్రదర్శించి క్రూరమృగాలపై భక్తులకు అవగాహన.
  • కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడి చేతికి ఒక కర్ర.

ఈ నిర్ణయాలన్నీ ఓకే కానీ, భక్తుడి చేతికి కర్ర ఇస్తామనే టీటీడీ నిర్ణయంపై విమర్శలు చెలరేగుతున్నాయి. చేతిలో కర్ర భక్తులను కాపాడుతుందా? దూసుకొచ్చే చిరుతను కర్రతో నిలువరించగలరా? అనేదే అసలు ప్రశ్న.

కలియుగదైవం వేంకటేశ్వరున్ని దర్శించుకోవడం కోసం కొన్ని వేల సంఖ్యలో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక తిరుమలకు వచ్చే ఆదాయం రూ. వందల కోట్లు. అలాంటి టీటీడీ నుంచి కర్రను రక్షణ కవచంగా ఇస్తారని ఎవరూ ఊహించరు. ప్రాణాలు కాపాడుకోవడానికి బహుశా ఇంకో మార్గం ఆలోచిస్తే బాగుండేది, పులుల నుంచి రక్షణకు మరో మార్గం అన్వేషిస్తే సరిపోయేది. ఇలా చేతికి కర్ర ఇవ్వడమనే నిర్ణయం మాత్రం సరైనది కాదనిపిస్తోంది.

ఓ వైపు సాంకేతికతలో అందరూ దూసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం వాటితో పనిలేదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ‘జూ’లో సందర్శకులకు ప్రాణహాని కలగకూడదని సేఫ్టీ గ్లాస్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి ఏర్పాటు ఏదైనా చేస్తే బాగుండేది. అయితే దీనికి కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. అందుకే ఇలాంటి నిర్ణయాల నుంచి టీటీడీ వెనక్కుతగ్గినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా చేతికి కర్ర అందించడం మాత్రం సరైన నిర్ణయం కాదు.

ఇక జనజీవనంలోకి వచ్చి వన్య ప్రాణులు దాడులు చేయట్లేదు. వాటి ప్రదేశంలోకే భక్తులు వెళ్తున్నారు. అలాంటి ప్రదేశాల్లో ఎప్పటికైనా వన్యమృగాల నుంచి ముప్పు ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భక్తుల సంరక్షణ కోసం ఏమైనా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించారా? స్వల్పకాలిక ప్రణాళికలు ఎప్పటికీ ఉపశమనమే కలిగిస్తాయి, విపత్తు నుంచి తప్పించలేవు. కానీ సమీక్షలో తీసుకున్న షార్ట్‌ టర్మ్ ప్లాన్స్‌ భక్తులను ఎంతమేరకు కాపాడతాయే చూడాలి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం