గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ”ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్‌సెట్, బ్లూటూత్, ఇయర్‌బడ్స్ వంటివి పెట్టుకొని ప్రయాణం చేస్తే రూ.20 వేల జరిమానా విధించనుంది. ఆగస్టు నుంచి ఇది అమల్లోకి రానుంది” అని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై రాష్ట్ర రవాణ శాఖ స్పందించింది. అది అవాస్తమని కొట్టిపారేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే జరిమానాలు వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ తెలిపింది. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ.1500 నుంచి రూ. 2వేలు జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఇదే విధంగా పదేపదే పట్టుబడితే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశంపై జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపింది.