చాక్లెట్ తయారీల ప్రముఖ సంస్థ మాండలేజ్ ఆంధ్రపదేశ్‌లో రూ.1600 కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీసిటీలో చాక్లెట్ తయారీ కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ సంస్థ ఇండియా సప్లైచైన్ ఉపాధ్యక్షుడు వేనెపల్లి వెంకట్ పాల్గొన్నారు.
మాండలేజ్ సంస్థ క్యాడ్‌బరీ డైరీమిల్క్, ఓరియో, బోర్న్‌విటా వంటి బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో వీటికి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా ఈ కంపెనీ తమ విస్తరణపై దృష్టిపెట్టింది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో తమ ఉత్పత్తిని మరింత పెంచనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఉత్పత్తి ప్లాంట్లలో శ్రీసిటీ ఒకటిగా నిలుస్తుందని పేర్కొంది.
కాగా, ఏటా 2.20 లక్షల టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభించనుంది. అంతేగాక దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.