మెహందీ, సంగీత్, బారాత్.. ఇవన్నీ కొన్ని వర్గాల పెళ్లిళ్లలో మాత్రమే కనిపించే సంప్రదాయాలు. కానీ ఇప్పుడివి అన్ని వర్గాలకు కామన్ ట్రెడిషన్స్ గా మారాయి. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్స్ ఎంత కామన్ అయిపోయాయో.. పెళ్లిలో వధూవరులు డాన్స్ చేయడం కూడా అంతే కామన్ గా మారిందిప్పుడు. కానీ కొంతమంది పెద్దోళ్లు మాత్రం ఇలాంటి వాటికి అస్సలు అంగీకరించరు. ఫలితంగా గొడవలు జరిగి తలలు పగిలిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లో ఉన్న సీతానగరం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో రాత్రి ఓ పెళ్లి జరిగింది. వరుడు సుబ్రమణ్యం, వధువు పూజిత నిండుగా తయారయ్యారు. వచ్చి పెళ్లి పీటలపై కూర్చున్నారు. పెళ్లి తతంగం కూడా ముగిసింది. అంతలోనే అక్కడున్న బంధువులు, స్నేహితులు.. వధూవరులిద్దర్నీ డాన్స్ చేయమని బలవంతం చేశారు.
సుబ్రమణ్యం డాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు, పూజిత కూడా సై అంది. కానీ వరుడు బంధువులు అంగీకరించలేదు. పెళ్లికూతురు డాన్స్ చేయండం ఏంటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ పూజిక సంబంధీకులు మాత్రం పట్టించుకోలేదు. ఆమెను మండపం నుంచి కిందకు తీసుకొచ్చి డాన్స్ చేయించడానికి రెడీ అయ్యారు.
దీంతో సుబ్రమణ్యం బంధువులకు కోపం కట్టలు తెంచుకుంది. తాము చెప్పినా వినకపోవడం ఏంటనే ఇగో ఎక్కువైంది. వెంనటే వధువు బంధువులపై వాళ్లు దాడికి దిగారు. ప్రతిగా వధువు కుటుంబీకులు కూడా దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఓ మహిళ తల పగిలింది, మరొక వ్యక్తి చేయి విరిగింది. ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలా సరదాగా సాగాల్సిన పెళ్లి వేడుక, డాన్స్ కారణంగా రసాభసగా మారింది.