మైనర్ బాలికకు ఇష్టం లేకుండా వివాహం చేస్తున్నారని బంధువులు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. మరికొన్ని క్షణాల్లో పెళ్లి జరుగుతుండగా దిశ పోలీసులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనుమసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
అనుమసముద్రం లో నివాసం ఉండే అరుణ అనే మహిళకు 16 సంవత్సరాల కూతురు ఉంది. గత ఏడాది అరుణ భర్త కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కుటుంబ పోషణ భారంగా భావించిన అరుణ తన మైనర్ కూతురికి వివాహం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో సమీప బంధువు అయిన తిరుమల అనే వ్యక్తికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయాలని ముహుర్తాలు పెట్టుకున్నారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, ఇంకా చదువుకుంటానని బంధువుల వద్ద బాలిక వాపోయింది. మైనర్ బాలిక బాధను అర్థం చేసుకున్న ప్రశాంతి అనే మహిళ దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
మైనర్ బాలికకు వివాహం జరుగుతోందని దిశ SOS కు సమాచారం అందిన వెంటనే మండపానికి పోలీసులు చేరుకున్నారు. పెళ్లి బట్టల్లో ఉన్న మైనర్ బాలికను కలిసి వివరాలు సేకరించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, డిగ్రీ వరకైనా చదువుకోవాలని ఉందని మైనర్ బాలిక పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో బాలిక తల్లి అరుణకు, పెళ్లి కొడుకు తిరుమల కు దిశ టీం కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల సూచన మేరకు పెళ్లి ని క్యాన్సల్ చేస్తున్నట్లు తల్లి అరుణ స్పష్టం చేసింది. దిశ SOS కు కాల్ చేసిన వెంటనే స్పందించిన అనుమసముద్రం పోలీసులకు బాలిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.