బాక్సాఫీస్ బరిలో మరోసారి రద్దీ కనిపిస్తోంది. ఈ వీకెండ్ ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ ప్రచారం కారణంగా అందరికీ కస్టడీనే కనిపిస్తోంది. కానీ నాగచైతన్య నటించిన ఈ సినిమాతో పాటు మరో 8 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ముందుగా కస్టడీతోనే మొదలుపెడదాం. నాగచైతన్య-కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇళయరాజా-యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక కస్టడీతో పాటు మ్యూజిక్ స్కూల్ అనే చిన్న సినిమా వస్తోంది. శ్రియ ఇందులో లీడ్ రోల్ పోషించింది.
ఈ రెండు సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన భువన విజయమ్ అనే సినిమా కూడా ఈ వారమే థియేటర్లలోకి వస్తోంది. సునీల్, వెన్నెల కిషోర్, ధనరాజ్, శ్రీనివాసరెడ్డి లాంటి కాస్టింగ్ ఇందులో ఉంది. అదే టైమ్ లో సునీల్ కీలక పాత్ర పోషించిన మరో సినిమా కథ వెనక కథ కూడా రిలీజ్ అవుతోంది.
ఇక ఐశ్వర్య రాజేష్ నటించిన ఫర్హానా సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. వీటితో పాటు ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, టీ బ్రేక్ అనే మరో 2 సినిమాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వారం కూడా రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది.
రామ్ పోతినేని హీరోగా నటించిన రెడీ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.