కొంతమంది హీరోయిన్లు మెల్లగా కెరీర్ స్టార్ట్ చేస్తారు. క్రమక్రమంగా గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తారు. మరికొందరు హీరోయిన్లు రావడమే బ్లాక్ బస్టర్ హిట్ తో వస్తారు, వరుసపెట్టి సినిమాలు చేస్తారు. కానీ తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు.
కృతిశెట్టి రెండో టైపు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పైకి ఉప్పెనలా దూసుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ తర్వాత అ స్థాయిలో హిట్ అందించలేకపోయింది. హీరోలు, స్టోరీల సెలక్షన్ లో తప్పటడుగులు వేసి, కెరీర్ మీదకు తెచ్చుకుంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా చేసింది. ఆ సినిమాలో సాయిపల్లవికి క్రేజ్ వచ్చింది కానీ కృతికి రాలేదు. తర్వాత బంగార్రాజుతో సక్సెస్ అందుకున్నప్పటికీ, ఆ వెంటనే వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో ఫ్లాపులిచ్చింది.
రామ్ సరసన వారియర్ సినిమా చేసింది కృతిశెట్టి. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్. ఇక నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గంలో నటించింది. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా వరుసగా ఫ్లాపులిస్తున్న టైమ్ లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా వచ్చింది. అది ఫ్లాపుల్ని మించిపోయింది. ఏకంగా డిజాస్టర్ అయింది. దీంతో కృతిశెట్టి కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఇక ఆమె తన ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే పెట్టుకుంది.
అయితే కృతికి ఈసారి కూడా కాలం కలిసిరాలేదు. కస్టడీ కూడా ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది. కంటెంట్ బాగున్నప్పటికీ, నెరేషన్ తేడా కొట్టడంతో సినిమా చతికిలపడింది. ఈ సినిమాతో కృతి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల సంఖ్య 4కు చేరుకుంది. టాలీవుడ్ లో ఓ హీరోయిన్ కు వరుసగా ఫ్లాపులొస్తున్నాయంటే, కెరీర్ ఇబ్బందుల్లో పడినట్టే. ప్రస్తుతం కృతి శెట్టి అలాంటి ఇబ్బందులే ఫేస్ చేస్తోంది.