ఆదిపురుష్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు ప్రభాస్. ఆ సినిమాతో మరోసారి 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరాడు. ఇలా తన ప్రతి సినిమాతో 300 కోట్ల రూపాయల వసూళ్లు చూపిస్తున్నాడు ప్రభాస్. అయితే ఆదిపురుష్ సినిమా సోమవారం నుంచి పడిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తన ఫోకస్ షిఫ్ట్ చేశాడు. ఆదిపురుష్ నుంచి సలార్ కు మారారు.
ఆదిపురుష్ తర్వాత రాబోయే మరో బిగ్గెస్ట్ చిత్రం “సలార్”. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్నాడు. ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సరిగ్గా 100 రోజులు మాత్రమే ఉంది. 100 రోజుల కౌంట్ డౌన్ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
దీంతో సలార్ ట్రెండింగ్ మరోసారి మొదలైంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోడల్ శ్రియ రెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కేజీఎఫ్ ను మించి సలార్ సినిమా ఉంటుందని ఆమె ఊరిస్తోంది.
సలార్ అనేది ఓ ప్రత్యేకమైన ప్రపంచంలా అనిపిస్తుందని, హాలీవుడ్ లో వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో సలార్ ప్రపంచం ఉంటుందని చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు టీజర్ ఎడిటింగ్ కూడా నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం, 10 రోజుల్లో సలార్ టీజర్ రాబోతోంది.
నిజానికి ఆదిపురుష్ తోనే సలార్ టీజర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టైమ్ లైన్స్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.