పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చపై ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లేటప్పుడు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. ఇది అభ్యంతరకర ప్రవర్తన అని భాజపా మహిళ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీలు సంతకాలు చేసి సభాపతికి అందజేశారు. రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
”రాహుల్ తీరును ఖండిస్తున్నా. వెళ్లిపోయే ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. మహిళలను గౌరవించని వారే ఇలా ప్రవర్తిస్తారు. మహిళ ఎంపీలు కూర్చున్న వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. పార్లమెంట్‌లో ఓ ఎంపీ ఇలా చేయడం దేశచరిత్రలోనే ఎప్పుడూ లేదు” అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
కాగా, అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో బుధవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మణిపుర్‌లో దేశాన్ని హత్య చేశారని, మణిపుర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేశారని అన్నారు. భారత సైన్యం తలుచుకుంటే ఒక్క రోజులోనే మణిపుర్ శాంతి తీసుకురాగలదని, కానీ ప్రభుత్వం అలా చేయడం లేదని పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం రాహుల్ లోక్‌సభ నుంచి వెళ్లిపోయారు.