ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు షాక్! సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ శనివారం జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నట్లు సమాచారం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఈ ఓపెనర్‌కు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గింది. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారని సమాచారం. ప్రస్తుతం గిల్ చెన్నైలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పటికే గిల్ అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అందుబాటులో లేని విషయం తెలిసిందే. అంతేగాక బుధవారం జరగనున్న అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లోనూ అతడు బరిలోకి దిగట్లేదని బీసీసీఐ సోమవారమే అధికారికంగా ప్రకటించింది. అతడు జట్టుతో దిల్లీకి బయలుదేరలేదని చెన్నైలోనే చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. అయితే ప్లేట్‌లెట్ కౌంట్ కారణంగా అతడు పాక్ మ్యాచ్‌కు కూడా దూరమైతే భారత జట్టుకు ఇది ప్రతికూలాంశమే.
శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. క్లాసిక్, విధ్వంసం కలయికతో పరుగుల దాహం తీర్చుకుంటున్నాడు. ఈ ఏడాదిలో 20 వన్డేలు ఆడిన అతడు అయిదు శతకాలు సాధించాడు. 73కు పైగా సగటుతో రన్స్ చేస్తున్నాడు. ఇక ‘గిల్-రోహిత్’ సూపర్ హిట్ భాగస్వామ్యంగా ప్రశంసలు పొందారు. ఈ జోడి ఆడిన 13 వన్డేల్లో 87 సగటుతో 1048 పరుగులు చేసింది. దీనిలో అయిదు శతకాలు, నాలుగు అర్ధశతకాల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే హైవోల్టేజ్ మ్యాచ్ అయిన పాక్‌తో గిల్ అందుబాటులో ఉండడనే వార్తలు అభిమానులను నిరాశపరుస్తోంది.