world cup
Home » India vs New Zealand- ఆ కన్నీటికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

India vs New Zealand- ఆ కన్నీటికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

by admin
0 comment

వన్డే వరల్డ్‌కప్‌ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్‌.. దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత ఈజీనా అనిపించేలా పరుగులు చేయడం, వికెట్లు ఎగిరిపడటం, అబ్బురపరిచేలా క్యాచ్‌లు అందుకోవడం, వారెవ్వా.. ఇలా క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఈ ప్రపంచకప్‌ ‘కిక్కును ఇస్తూ ఫుల్‌మీల్స్‌’ అందించింది. పది జట్లు.. 45 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అంతిమంగా నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకొచ్చాయి.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అంచనాలను అందుకుంటూ భారత్‌ టేబుల్‌ టాప్‌లో నిలిచింది. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగుతూ దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరింది. ఇక టోర్నీ స్టార్టింగ్‌లో తడబడిన ఆస్ట్రేలియా.. తర్వాత పైచేయి సాధించి మూడో స్థానానికి చేరింది. న్యూజిలాండ్‌ నిలకడైన ఆటను కొనసాగిస్తూ టాప్‌-4లో చోటు సంపాందించింది. ఫైనల్‌ బెర్తు కోసం వాంఖడే వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌, ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందంటే అది రోహిత్‌సేనే. మన జట్టు ఆధిపత్యం ఎలా ఉందంటే.. కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్లు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్‌తో సెమీస్‌ అంటే భారత అభిమానుల్లో తెలియని ఆందోళన. అందరికీ 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్‌ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన భారత్ నాకౌట్‌లో మాత్రం తడబడింది. ధోనీ క్రీజులో ఉన్నంతవరకు అభిమానులంతా విజయంపై ధీమాగానే ఉన్నారు. కానీ ధోనీ రనౌటవ్వడంతో స్టేడియంతో పాటు దేశమంతా నిశ్శబ్ధమైంది. ధోనీ కన్నీటితో మైదానాన్ని వీడటం, డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లి, రోహిత్ కంటతడి పెట్టడం అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ కన్నీటికి ప్రతీకారం తీర్చుకునే టైమ్ వచ్చింది.

ప్రస్తుతం భారత జట్టు శత్రు దుర్భేద్యంగా ఉంది. ఏ జట్టు అయినా టీమిండియాను ఢీ కొట్టాలంటే సంకోచిస్తోంది. ఇదే తరహాలో రోహిత్‌సేన చెలరేగి కివీస్‌ను చిత్తుచేయాలి. ఈ టోర్నీలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ను భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే సెమీస్‌ లో కివీస్‌ అంత తేలికగా తలవంచదు. చివరి నాలుగు నాకౌట్‌ మ్యాచ్‌ ల్లో టీమిండియాపై న్యూజిలాండ్‌దే విజయం. కానీ గత మూడు వన్డే ప్రపంచకప్‌ నాకౌట్స్‌లో ఆతిథ్య జట్టు చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం మనకి సానుకూలాంశం. సొంతమైదానంలో, అభిమానుల మధ్య టీమిండియా రెట్టింపు బలం, ఉత్సాహంతో సత్తాచాటుతోంది.

ఇక వాంఖడే స్టేడియంలో టాస్‌ ఎంతో కీలకం కానుంది. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 357 పరుగులు. అదే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఏవరేజ్‌ స్కోరు 188 మాత్రమే. అఫ్గానిస్థాన్‌పై గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల ఛేదనలో ఆసీస్‌ విజయ తీరాలకు చేరింది. అందుకే ఈ సెమీఫైనల్లో టాస్‌ ఎంతో కీలకం కానుంది. ఒకవేళ టీమిండియా ఛేజింగ్‌ చేయాల్సి వస్తే మొదటి 15 ఓవర్లను చాలా జాగ్రత్తగా ఆడాలని వాంఖడే గణాంకాలు చెబుతున్నాయి. లైట్ల కింద స్వింగ్, సీమింగ్‌ కు కొత్తబంతి ఎక్కువ ఎఫెక్ట్‌ చూపిస్తుంది.సెకండ్‌ ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో ఏవరేజ్‌గా నాలుగు వికెట్లు బౌలర్లు సాధిస్తున్నారు.

గత ప్రపంచకప్ సెమీస్‌లోనూ టీమిండియా ఛేజింగ్‌లోనే తడబడింది. అయితే ఛేజింగ్‌ తొలి 15 ఓవర్లను వాంఖడేలో సమర్థవంతంగా ఎదుర్కొంటే భారత్‌కు ఇక తిరుగుండదు. హిట్‌మ్యాన్‌ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఎప్పటిలాగే మిగిలిన పనిని విరాట్ కోహ్లి పూర్తి చేయాలి. రోహిత్‌ దూకుడైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు పునాదిని అందిస్తే.. కోహ్లిని తర్వాత ఔట్‌ చేయడం ఏ ప్లేయర్‌కైనా అంతతేలిక కాదు. ఈ జోడీ మరోసారి నిలబడితే ఫైనల్లో భారత్‌ నిలవడం ఖాయం. వీరిద్దరికీ తోడుగా సీనియర్‌ ప్లేయర్లు కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నిలకడగా పరుగులు చేయడం భారత్‌కు మరింత బలాన్ని ఇస్తుంది. గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా కూడా మెరిస్తే.. టాస్‌ ఓడినా సెమీస్‌లో మనకు తిరుగుండదు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links