పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ. భారీ హైప్ తో వస్తున్న ప్రాజెక్టు ఇది. పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమాల్లో చాలామంది దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంది. ఎందుకంటే ఇది రీమేక్ సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్ లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమాని ప్రకటించినప్పుడు, పవన్ కళ్యాణ్ కోసం టీమ్ చాలా తక్కువ పని దినాలను ప్లాన్ చేసింది. అటుఇటుగా 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోయేట్టుగా కాల్షీట్లు ప్లాన్ చేశారు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఇలా సెట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పవన్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రో సినిమాతో అతడి మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది. బ్రో సినిమాకు కూడా ఇలానే సెట్ చేశాడు త్రివిక్రమ్. చాలా తక్కువ పనిదినాల్లో పవన్ తో పని పూర్తిచేశారు. కట్ చేస్తే, సినిమా రిజల్ట్ తేడాకొట్టింది.
అందుకే ఓజీ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు పవన్ కల్యాణ్. తన కాల్షీట్లపై దృష్టి పెట్టొద్దని, స్క్రిప్ట్ ను మరోసారి పకడ్బందీగా రాయాలని సూచించాడు. అవసరమైతే తను మరిన్ని కాల్షీట్లు కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కథలో పవన్ కొన్ని కీలక మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఓజీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఓజీ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇలా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత, స్క్రిప్టులో మార్పుచేర్పులు చేస్తే, వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఖాయం. షూట్ చేసిన పార్ట్ లో చాలా భాగం పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి ఓజీ విషయంలో యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సుజీత్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.