12 jyotirlingas
Home » జ్యోతిర్లింగాలు-వాటి విశిష్టత

జ్యోతిర్లింగాలు-వాటి విశిష్టత

by admin
0 comment

దేశంలోని 12 జ్యోతిర్లింగాలను భక్తులు నిత్యం పూజిస్తుంటారు. ఆది దేవుడైన పరమశివుడ్ని భక్తులు భోళాశంకరుడుగా, పరమేశ్వరునిగా ఎన్నో నామాలతో పిలుస్తుంటారు. అయితే భక్తులంతా లింగరూపంలో ఉన్న శివుణ్ణి మాత్రమే అభిషేకిస్తూ, వివిధ రకాల నైవేధ్యాలు చెల్లిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగాల దర్శనానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నట్లు పండితులు చెబుతున్నప్పటికి అందులో 12 జ్యోతిర్లింగాలు మాత్రమే విశేష ప్రాథాన్యతను సంతరించుకున్నాయి. మరి ఈ జ్యోతిర్లింగాలు దేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసుకుందాం.

శ్రీశైల జ్యోతిర్లింగం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది. డోర్నాల రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగగా పిలుస్తుంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలం 6వ శక్తిపీఠంగా పేర్కొంటారు. ఇక్కడ శివుడు పార్వతీదేవితో కలిసి స్వయంభువుగా భ్రమరాంబామల్లికార్జునుడుగా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన వేయి శివలింగాలు, ద్వాపరయుగంలో వనవాస కాలంలో పంచపాండవులు ప్రతిష్టించిన ఐదు శివలింగాలు ఇక్కడే కొలువుదీరినట్లు భక్తుల ప్రగాఢ నమ్మకం. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాసినట్లు పురాణాల్లో ఉంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పుణ్య ప్రదేశం శ్రీశైల జ్యోతిర్లింగం.

ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లిగం
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం క్షిప్రనది ఒడ్డున ఉంది. ఈ పట్టణంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్థలింగాలు, 30 శివలింగాలు, ఏకాదశరుద్రులు, ఇంకా వందలాదిగా దేవత మందిరాలు, నీటి కుండాలు ఉన్నాయి. మంత్రశక్తిలో ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఉద్భవించిందని భక్తుల విశ్వాసం. తాంత్రిక మంత్రాలతో పూజలందుకుంటోన్న ఏకైక జ్యోతిర్లింగం ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ మహాకాళేశ్వరుడికి ప్రాతఃకాలం భస్మాభిషేకం నిర్వహిస్తారు. కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఖాండ్వా జిల్లాలో నర్మదా నది తీరంలో, వింద్య పర్వతంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం రెండు భాగాలుగా ఉండి, రెండు నామాలతో పూజలందుకుంటోంది.ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పూజలందుకుంటోంది. ఈ క్షేత్రం సంస్కృత అక్షరమైన “ఓం” ఆకారంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కగా ఉండటం ప్రత్యేకత.

వైద్యనాథుడు
వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం పాట్నా నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగ ప్రాశస్త్యం రామాయణ గాథతో ముడిపడి ఉంది. ఈ వైద్య నాథేశ్వరుడిని పూజించడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న వ్యాథులు నయం కావడంతో భక్తులు ఈ జ్యోతిర్లింగేశ్వరుడ్ని వైద్యనాథేశ్వరుడుగా పిలుస్తుంటారు. అంతేగాక అమృతేశ్వరుడని కూడా పిలుస్తుంటారు. దేవాసురులు, పాలసముద్రాన్ని మదించగా లభించిన అమృతాన్ని, ధన్వంతరిని ఈ జ్యోతిర్లింగంలో వివిధ కథల ద్వారా తెలుస్తుంది. ఈ జ్యోతిర్లింగాన్ని ఒకసారి తాకినంతనే సాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రీనాగనాథేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలో ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఈ జ్యోతిర్లింగం భూమిపై ఉద్భవించిన మొట్టమొదటి జ్యోతిర్లింగంగా భక్తులు భావిస్తారు. అరణ్యవాసం చేసినప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయం నిర్మించినట్లు పురాణాల్లో ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి యత్నించిగా నగ్నకాపాలికులు దాడిని తిప్పికొట్టినట్లుగా ప్రచారంలో ఉంది.

గుజరాత్‌లో సోమనాథుడు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన దివ్యలీలతో వెలిగించిన జ్యోతి ఇప్పటికీ వెలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానమాచరించి సోమనాథుడ్ని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సాక్షాత్తు చంద్రుడే ఇక్కడ సోమనాథేశ్వరుడ్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

తమిళనాడు రామేశ్వర జ్యోతిర్లింగం
ఈ రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పురాణ కథ ప్రకారం రావణాసురుణ్ణి సంహరించిన అనంతరం శ్రీరాముడు వారధిని దాటి దేశానికి వచ్చాడు. బ్రాహ్మణ హత్యాపాతకం పోవడం కోసం కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించినట్లు, సుముహూర్తం దాటిపోవడంతో సీతాదేవి సముద్రతీరంలో ఉన్న ఇసుకతో లింగం చేసి ప్రతిష్టించారు. ఇంతలో హనుమంతుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు సీతాదేవి ప్రతిష్టించిన ఇసుక లింగాన్ని హనుమంతుడు తోకతో తొలగించడానికి ప్రయత్నించి భంగపడ్డాడు. ఈ కారణంగా సీతాదేవి ప్రతిష్టించిన లింగం పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ఆంజనేయుడు ప్రతిష్టించినట్లు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రామేశ్వరంలో రెండు శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి రామేశ్వర లింగంగా ఇక్కడి శివలింగం ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని పర్వతవర్ధినీ దేవిగా భక్తులు కొలుస్తారు. రామేశ్వరంలో ఉన్న నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కేదారనాథ్ జ్యోతిర్లింగం
హిమాలయాల్లో మందాకినీ నదీతీరంలో కేదారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఉంది. ఎద్దుకు ఉండే మూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గుర్రాలపైగానీ, డోలీలో గాని వెళ్లి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఏడాదిలో 6 నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. నరనారాయణులు లోక కళ్యాణార్థం వేలాది సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి లోకకళ్యాణం కోసం ఈ కేదార్ నాథ్ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. శివపార్వతుల తపోభూమి, ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఇక్కడే ఉన్నాయి. హరిద్వార్ నుంచి బస్సుమార్గం ద్వారా వెళ్లి గౌరీకుండ్‌ను దర్శించుకోవచ్చు.

త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం
నాసిక్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరాలయం ఉంది. బ్రహ్మ, విష్ణువుల ప్రార్థనలతో ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలసినట్లు ప్రతీతి. బ్రహ్మదేవునితో త్రయంబకేశ్వరుడు కీర్తించబడినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగం చిన్న గుంటవలె మనకు కనిపిస్తుంది. ఈ గుంటలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగాలు కొలువై ఉన్నాయి.

భీమశంకర్ జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని పుణెకు 110 కిలోమీటర్ల దూరంలో భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది. కృష్ణానది ఉపనది భీమా ఉద్భవించిన ప్రదేశంలో భీమశంకర జ్యోతిర్లింగం వెలిసింది. త్రేతాయుగంలో రావణాసురుని సోదరుడైన కుంభకర్ణుని యొక్క కుమారుడైన రాక్షసభీముడ్ని నాశనం చేసే ఈశ్వరుని రూపంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. త్రిపురాసుర సంహరణ అనంతరం మహాశివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లుగా పురాణ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొలువైన అమ్మవారు కమలజాదేవిగా పూజలందుకుంటోంది. ఈ జ్యోతిర్లింగం అర్ధనారీశ్వర రూపంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చేదిగా ప్రసిద్ధి. ఈ శివలింగం నుంచి నిరంతరం నీరు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన స్వేద బిందువులే భీమనదిగా మారాయని స్థల పురాణం చెబుతుంది.

శ్రీఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఔరంగాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో అజంతా ఎల్లోరా గ్రామంలో శ్రీఘృష్ణేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ దేవగిరి కొండపై శ్రీఘృష్ణేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ అజంతా, ఎల్లోరా గుహలు ప్రపంచ దర్శనీయ ప్రాంతాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్ – ఔరంగాబాద్ ట్రైన్ ద్వారా ఔరంగాబాద్ లో దిగి అక్కడి నుంచి శ్రీ ఘృష్ణేశ్వర ఆలయానికి బస్సుద్వారా యాత్రికులు చేరుకోవచ్చు.

విశ్వేశ్వర జ్యోతిర్లింగం
శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది. దేవతలు నివాసముండే పుణ్యక్షేత్రంగా కాశీపట్టణాన్ని భావిస్తారు. గంగానది తీరంలో గల ఈ క్షేత్రాన్నికేవలం హిందవులే కాకుండా జైన, బౌద్ధ మతాలవారు దర్శించుకుంటారు. ఇక్కడి విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ ఆలయ సన్నిధిలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి శక్తిపీఠం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హైదరాబాద్ – వారణాశి ఎక్స్‌ప్రెస్ ద్వారా కాశీ చేరుకుని అక్కడ కొలువై ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని యాత్రికులు దర్శించుకోవచ్చు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links