నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వాసుకి, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
రన్ టైమ్: 2 గంటల 34 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: మే 18, 2023
రేటింగ్: 2.5/5
ఆ మధ్య థాంక్యూ అనే సినిమా వచ్చింది. ఇక రీసెంట్ గా ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అనే సినిమా వచ్చింది. ఈ రెండు కథలు వేరు కావొచ్చు. కానీ నెరేషన్ పరంగా బోర్ కొట్టించాయి. ఈరోజు అన్నీ మంచి శకునములే అనే సినిమా వచ్చింది. దీనికి కూడా పై రెండు సినిమాలతో సంబంధం లేదు. కానీ ఈ 3 సినిమాల మధ్య కామన్ పాయింట్, బోర్ కొట్టే నెరేషన్.
కథ కొత్తగా లేనప్పుడు కథనమైన బాగుండేలా చూసుకోవాలి. పాత కథకు, రొటీన్ నెరేషన్ ఇస్తే అది ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ఉంటుంది. ఇది సస్పెన్స్-థ్రిల్లర్ కాదు, కాబట్టి కథను సింపుల్ గా, ఓపెన్ గా మూడు ముక్కల్లో చెప్పుకోవచ్చు. విక్టోరియాపురంలో కాఫీ ఎస్టేజ్ నడిపించే రెండు కుటుంబాలు. ఎస్టేట్ కు సంబంధించి కుటుంబాల మధ్య గొడవలు నడుస్తుంటాయి. అయితే ఆ రెండు కుటుంబాలకు చెందిన మూడో తరంలో ఓ ప్రేమ జంట పుడుతుంది. అట్నుంచి హీరో, ఇట్నుంచి హీరోయిన్ వస్తారు. ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మరి వీళ్లు ఆ కుటుంబాల్ని కలిపారా లేదా అనేది స్టోరీ.
చివర్లో కలిపారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా అనవసరం. ఆటోమేటిగ్గా కలిసిపోతారనేది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి రొటీన్ కథకు మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుంది దర్శకురాలు నందినీరెడ్డి. కాకపోతే బ్యాక్ డ్రాప్ లో చూపించిన కొత్తదనం, నెరేషన్ లో చూపించలేకపోయింది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ‘ఏంటి ఇంత రోటీన్ గా సాగుతోంది’ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ను రెట్టింపు చేస్తూ వరుసగా సన్నివేశాలు పడుతుంటాయి. ఇక ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చిన్న పిల్లాడు కూడా ఊహించేస్తాడు.
అలా రొటీన్ గా సాగిన ఈ సినిమాను సెకండాఫ్ కొంచెం నిలబెట్టింది. కొన్ని మంచి ఫన్ మూమెంట్స్ తో పాటు, ఎమోషనల్ సన్నివేశాలు పడ్డాయి. కానీ ఇక్కడ కూడా సమస్య ఉంది. మంచి స్టార్ కాస్ట్ పెట్టుకోవడం వల్ల నటనపరంగా ఎవ్వర్నీ తక్కువచేసి చూడలేం. ఎటొచ్చి సన్నివేశాలు రొటీన్ గా ఉండడం వల్ల థియేటర్ లో ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయాడు.
ఇంకా చెప్పాలంటే.. నందినీరెడ్డి ఈ కథను, అందులో సన్నివేశాల్ని చాలా బాగా రాసుకుంది. ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పినట్టు చివరి 20 నిమిషాలు చాలా బాగుంది. కానీ నీరసమైన నెరేషన్ తో అప్పటికే మొహంమొత్తిన ప్రేక్షకుడు దాన్ని ఆస్వాదించలేడు. టెక్నికల్ టీమ్ నుంచి, నటీనటుల వరకు అంతా సిన్సియర్ గా వర్క్ చేసి ఓ బోరింగ్ ఔట్ పుట్ ఇచ్చారు. సినిమాలో ప్రతి సన్నివేశాన్నీ ఇంతకుముందు ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
హీరో సంతోష్ శోభన్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇలాంటి సెన్సిబుల్ యాక్టింగ్ లో అతడు రాటుదేలిపోయాడు, పైగా తన వయసుకు తగ్గ పాత్ర కావడంతో ఈజీగా చేశాడు. అతడి యాక్టింగ్ బాగుంది కానీ, ప్రతి సినిమాకు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ మాళవిక నాయర్ లుక్ బాగుంది కానీ, ఆమె పోషించిన పాత్ర రొటీన్ గా ఉంది. అప్పుడెప్పుడే వచ్చిన కల్యాణ వైభోగమే సినిమా నుంచి ఆమె ఇలాంటి పాత్రలు చాలా చేసిన ఫీలింగ్ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వాసుకి, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ల యాక్టింగ్ లో కొత్తదనం లేదు, అలా అని నెగెటివ్స్ కూడా లేవు. వాసుకు రీఎంట్రీ మాత్రం వృధా అయిందనే చెప్పాలి.
టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. మిక్కీ జే మేయర్ పాటలతో ఆకట్టుకోలేకపోయాడు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, లక్ష్మీ భూపాల డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల మరీ మెలొడ్రామా ఎక్కువైంది. స్వప్న సినిమాస్, మిత్రవిందా మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే.. కాస్త ఓపిగ్గా చూడగలిగితే అన్నీ మంచి శకునములే సినిమాను ఓసారి చూడొచ్చు.